మరోసారి పార్లమెంట్ సభ్యత్వాన్ని కోల్పోయిన లక్షద్వీప్​ ఎంపీ ఫైజల్

-

లక్షద్వీప్‌ ఎంపీ మహమ్మద్‌ ఫైజల్‌ మరోసారి తన పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోయారు. ఆయనపై మరోసారి అనర్హత వేటు వేస్తున్నట్లు లోక్​సభ సచివాలయం ప్రకటించింది. 2023 జనవరి 11 నుంచి ఈ అనర్హత వర్తిస్తుందని లోక్​సభ సచివాలయం వెల్లడించింది. దిగువ కోర్టు తనకు విధించిన శిక్షను సస్పెండ్‌ చేయాలని కోరుతూ ఫైజల్‌ చేసుకున్న అభ్యర్థనను కేరళ హైకోర్టు తిరస్కరించడంతో మళ్లీ ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని కోల్పోయారు.

హత్యాయత్నం కేసులో దోషిగా తేలిన లక్షద్వీప్‌ ఎంపీ మహమ్మద్‌ ఫైజల్‌.. దిగువ కోర్టు తనకు విధించిన శిక్షను సస్పెండ్‌ చేయాలని కోరుతూ కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన కేరళ హైకోర్టు.. ఫైజల్‌ చేసుకున్న అభ్యర్థనను మంగళవారం రోజున తిరస్కరించింది. ఫైజల్‌కు, మరో ముగ్గురికి దిగువ కోర్టు విధించిన 10 ఏళ్ల జైలు శిక్షను ఈ ఏడాది జనవరిలో హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేయడంతో.. దీనిని సవాల్‌ చేస్తూ లక్షద్వీప్‌ పాలనా యంత్రాంగం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టి ఆ తీర్పును కొట్టివేసింది.

అయితే, ఫైజల్‌ పార్లమెంటు సభ్యత్వం కోల్పోకుండా మూడు వారాల పాటు రక్షణ కల్పించింది. ఆయన పిటిషన్‌ను పునఃపరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కేరళ హైకోర్టును ఆదేశించింది. దీంతో కేరళ హైకోర్టు మంగళవారం తాజా నిర్ణయాన్ని వెలువరించింది.

Read more RELATED
Recommended to you

Latest news