ఢిల్లీలో మద్యం సంక్షోభం నెలకొంది. మందు బాబులు తీవ్రమైన అవస్థలు పడుతున్నారు. నవంబర్ నెల నుంచి నూతన ఎక్సైజ్ పాలసీ అమలు కానుండడంతో అక్కడి ప్రభుత్వం సెప్టెంబర్ 30న ప్రైవేటు లిక్కర్ షాపులను మూసేయించింది. దీంతో కేవలం ప్రభుత్వం ఆధ్వర్యంలోని వైన్ షాపులు మాత్రమే నడుస్తున్నాయి. కానీ వాటిల్లో కేవలం కొన్ని లిక్కర్ బ్రాండ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో మందు బాబులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు.
ఢిల్లీలో మొత్తం 32 జోన్లలో 27 మంది మద్యం వ్యాపారులకు లైసెన్స్‌లు ఇచ్చారు. ఒక్కో జోన్‌లో మొత్తం 10 వార్డులు ఉన్నాయి. దీంతో మొత్తం 260 వైన్ షాపుల్లో ప్రైవేటు వారు మద్యాన్ని విక్రయించనున్నారు. కానీ ఎక్సైజ్ పాలసీకి గడువు ముగియడంతో సెప్టెంబర్ 30న ప్రైవేటు లిక్కర్ షాపులను మూసేయించారు. కొత్తగా లైసెన్స్‌లు పొందిన వారు నవంబర్ 17 నుంచి మద్యం విక్రయించాల్సి ఉంటుంది. అప్పటి వరకు షాపులను మూసేయాలి. ఈ క్రమంలో ప్రస్తుతం ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న వైన్ షాపులను మాత్రమే తెరిచి ఉంచారు.
అయితే ఉన్న వైన్ షాపుల్లో మద్యం స్టాక్ లేదు. ఇప్పటికే మద్యం బాటిళ్ల స్టాక్ అయిపోయింది. నవంబర్ 17వ తేదీ వరకు షాపులు తెరుచుకునే అవకాశం లేకపోవడంతో మందు బాబులు ఆందోళన చెందుతున్నారు. చాలా చోట్ల మద్యం లభించడం లేదు. చాలా వరకు బ్రాండ్లకు చెందిన స్టాక్ అయిపోయింది. దీంతో మద్యం కోసం సుదూర ప్రాంతాలకు వెళ్తున్నారు.
నవంబర్ 17 అంటే ఇంకా చాలా రోజులు ఉంది. కానీ పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంది. వచ్చేది పండుగల సీజన్. కనుక మద్యం అమ్మకాలు బాగానే ఉంటాయి. కానీ ఢిల్లీలో మద్యం లభించడం లేదు. దీంతో మందు బాబులు ఆందోళన చెందుతున్నారు.