మహారాష్ట్ర నాగ్పుర్లో ఓ కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో తొమ్మది మంది దుర్మరణం పాలయ్యారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. బజార్గావ్ గ్రామంలోని సోలార్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో ఇవాళ ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్యాస్ట్ బూస్టర్ ప్లాంట్ను ప్యాక్ చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించినట్లు సమాచారం. ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. మంటల్లో ఎవరైనా చిక్కుకున్నారేమో అని వారి కోసం సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
“సోలార్ కంపెనీలో పేలుడు సంభవించినట్లు మాకు ఫిర్యాదు అందింది. వెంటనే మేం ఫైర్ ఇంజిన్ వాళ్లను అలర్ట్ చేశాం. మేం వచ్చే సరికే వారు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో తొమ్మిది మంది చనిపోయారు. చాలా మంది గాయపడ్డారు. వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. క్యాస్ట్ బూస్టర్ ప్లాంట్ను ప్యాక్ చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు జరిగినట్లు గాయపడిన కార్మికులు చెప్పారు. ఈ ఘటన గురించి అగ్నిమాపక సిబ్బంది ఇచ్చిన వివరాలతో దర్యాప్తు చేస్తున్నాం. త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేస్తాం.” అని స్థానిక పోలీసులు తెలిపారు.