భారత్-మాల్దీవుల మధ్య దౌత్యపరమై విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. భారత ప్రధాని నరేంద్రమోదీ, ఆ దేశ ప్రజలకు ముయిజ్జు క్షమాపణలు చెప్పాలని ఒత్తిడి చేస్తున్నాయి. చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్న తమ అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం ప్రవేశ పెట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
పొరుగు దేశంతో సంబంధాలు ప్రభావితం అయ్యే విధంగా మాట్లాడకూడదని విపక్ష నేత ఖాసీం ఇబ్రహీం అన్నారు. చైనా పర్యటన అనంతరం చేసిన వ్యాఖ్యలపై ముయిజ్జు భారత ప్రభుత్వానికి, ఆ దేశ ప్రధానికి అధికారికంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అధ్యక్షుడు ఎంపిక చేసిన మంత్రి మండలిని ఆమోదించేందుకు ఆదివారం సమావేశమైన పార్లమెంటు అధికార, విపక్ష ఎంపీల తోపులాటలు, ముష్టిఘాతాలతో అట్టుడికింది. దీంతో ఓటింగ్ జరగకుండానే సభ ముగిసింది. సోమవారం రోజునసమావేశమైన పార్లమెంటు ముగ్గురు మంత్రులకు వ్యతిరేకంగా ఓటు వేయగా మాల్దీవుల రాజ్యాంగం ప్రకారం ఆ మంత్రుల పదవులు ఊడినట్టే.