భారత్‌తో వివాదం వేళ మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు మరోసారి న్యూదిల్లీపై నోరు పారేసుకున్నారు. మే 10 తర్వాత భారత్‌కు చెందిన ఒక్క మిలిటరీ సిబ్బంది కూడా తమ భూభాగంలో ఉండకూదని ఇప్పటికే చెప్పిన ఆయన కనీసం సివిల్ డ్రెస్సుల్లో కూడా ఇక్కడ సంచరించొద్దంటూ వ్యాఖ్యానించారు. సైనిక సహకారంపై మాల్దీవులు-చైనా మధ్య కీలక ఒప్పందం జరిగిన గంటల వ్యవధిలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.
ముయిజ్జు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరు దేశాల మధ్య దూరం పెరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తమ దేశంలోని మూడు వైమానిక స్థావరాల్లో ఒకదానిలో విధులు నిర్వర్తిస్తోన్న భారత బలగాలు మార్చి 10లోగా, మిగతా రెండు స్థావరాల్లోని దళాలు మే 10నాటికి వెనక్కి వెళ్లిపోవాలని ముయిజ్జు సూచించారు. దీనిపై ఫిబ్రవరి 2న దిల్లీ వేదికగా ఉన్నత స్థాయి సమావేశం జరగగా తమ బలగాల స్థానంలో సమర్థులైన సాంకేతిక సిబ్బందిని నియమించేందుకు దిల్లీ పెట్టిన షరతును మాల్దీవులు అంగీకరించింది.