“మనలోకం” ప్రత్యేకం: తొందరగా చల్లారిపోయే రక్తం ఇండియన్స్ సొంతం!!

-

సడన్ గా ఒక రోజు శత్రుదేశం నుంచి వచ్చిన ఉగ్రవాదులు.. బోర్డర్ దాటి “ఇండియా” సైనికులపై దాడిచేసి.. ఆ దొంగదెబ్బలను గర్వంగా ఫీలవుతూ సిగ్గులేకుండా ప్రకటనలు ఇచ్చుకుంటూ పోతుంటారు. మాకేమీ తెలియదు.. జీవ హింస మహాపాపం.. అలాంటి పనులు తామెప్పుడూ చేయం.. అసలు ఉగ్రవాదులు అనబడేవారికి మా దేశంలో చోటు లేదు.. అని ఆ శత్రుదేశం పాకిస్థాన్… అంతర్జాతీయ మీడియా ముందు అద్భుతమైన ఆస్కార్ ఫెర్ఫార్మెన్స్ చేస్తుంటుంది. వారి సంగతి అలా ఉంటే… అనంతరం “ఇండియన్స్” సంగతి చూడాలి!

చనిపోయిన అమరవీరులకు నివాళులు అర్పిస్తుంటారు.. టీవీల్లో శాడ్ బ్యాంక్ గ్రౌండ్ స్కోర్ వేసి ప్రోగ్రాంస్ చేస్తుంటారు.. ఇక జనాలంతా కొవ్వొత్తులు పట్టుకుని రోడ్లపైకి వస్తారు.. నాయకులు తెగ ఎమోషన్ అయిపోతారు.. కొందరైతే రక్తం మరిగిపోతుందంటారు… చూస్తూ ఊరుకోం అని ప్రభుత్వంలోని పెద్దలు చెబుతుంటారు. వాళ్లు వచ్చి “ఇండియన్” సైనికులను 10 మందినో, 20మందినో చంపి వెళ్లిన తర్వాత.. వారే శాంతి చర్చలకు వస్తారు.. పాకిస్థాన్ తోకముడిచింది అని “ఇండియన్” పత్రికల్లో బ్యానర్ ఐటంస్ వేసుకుంటారు.. అమరులైన వీర జవాన్ లను కొన్ని రోజుల తర్వాత మరిచిపోతారు! ఇది “ఇండియా”లో నిత్యకృత్యం!!

ఆ కాసేపు మాత్రం… పాకిస్థాన్ తో యుద్దమే.. “ఇండియా”కు శాంతే శాపమయ్యింది.. వారికీ “ఇండియా”కు ఇంక ఎలాంటి లావాదేవీలు ఉండవు..అని ప్రకటనలిస్తారు.. పొద్దున్న లేస్తే టీవీలో కనబడి “ఇండియా” గొప్పతనం చెప్పే చాలా మంది పెద్దలు, యోగా గురువులు వారి కంపెనీల్లో తయారయిన వస్తువులను పాక్ లో అమ్ముకుని లాభాలు గడిస్తుంటారు.. సాయంత్రం పూట పాకిస్థాన్ డౌన్ డౌన్ అంటుంటారు! వారే అధికారంలో ఉన్న పార్టీలకు “ఫండ్స్” ఇస్తుంటారు! ఇలాంటప్పుడు పాకిస్థాన్ ఎన్ని దొంగదెబ్బలు కొడుతున్నా… “ఇండియా” తిరగబడగలదా… యుద్ధం అనేది జరగగలదా? పదిమంది పదిమంది ఎన్నేసిసార్లు దొంగదెబ్బకు బలవ్వాలి… ఒకేసారి వందలమంది వీరమరణం పొందడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతుంటే!

భారత్-చైనా ఆర్మీ మధ్య తీవ్రస్థాయిలో హింసాత్మక ఘర్షణలు తలెత్తాయి. ముఖాముఖీ పోరాటంలో రాళ్లు, ఇనుప రాడ్ లతో చైనా సైనికులు దాడి చేశారని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఈ దాడిలో 20 మంది “ఇండియన్”సైనికులు అమరులయ్యారు. మళ్లీ “ఇండియా”లో సేం సీన్ రిపీట్!! దేశంలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతుంది.. చైనా కి తగిన బుద్ది చెప్పాల్సిందే అని అంతా కోరుకుంటున్నారు.. సోషల్ మీడియాలో దేశాభిమానాన్ని పొంగి పొర్లించేస్తున్నారు.. ఆన్ లైన్ లో పౌరుషాల కట్టలు తెంచేస్తున్నారు!

“ఇండియా” గడ్డపై పుట్టిన ఏ ఒక్కడైనా… ఇకనుంచైనా ఒక్క చైనా వస్తువుని కనీసం రేపటి నుంచైనా, పోనీ వచ్చే నెలనుంచైనా, పోనీ వచ్చే ఏడాది నుంచైనా కొనకుండా ఉంటాడా? “ఇండియా”లో వ్యాపారాలు చేసుని, “ఇండియా” నుంచి వచ్చిన లాభాలతో “ఇండియా”పైనే దాడిచేస్తున్నారు అని మేధావులైన “ఇండియన్స్” గ్రహించగలరా? చైనా ఉత్పత్తులను దొంగచాటుగా దిగుమతి చేయనియ్యకుండా అధికారులు చూడగలరా? అసలు చైనాతో దిగుమతుల కార్యక్రమాన్ని ఆపుకోగలరా?

ప్రభుత్వం చేపట్టే టెండర్లలో చైనా కంపెనీలు పాల్గొనకుండా నిషేధం విధించగలరా? చైనాను ఆర్థికంగా దెబ్బతీయడానికి ఉన్న ఎన్నో అవకాశాలున్న “ఇండియా”.. ఆ ధైర్యం చేయగలుగుతుందా? మరెందుకయ్యా…. ఊరికే కబుర్లు చెబుతారు… ఊరికే ప్రకటనలిస్తారు… ఊరికే తెగ ఫీలయిపోతుంటారు…!! “ఇండియన్స్” రక్తంలో వేడికి, ప్రస్తుతం ఉన్న “ఇండియన్స్” యొక్క పౌరుషానికి ఆయుస్సు ఎంత తక్కువో తెలుసా… ఇవాళ, రేపు టీవీ, పేపర్ చూడకపోతే సరిపోతుంది… ఎల్లుండు ఈ వార్త ఉండదు… అసలు అంత ఘోరం జరిగిందన్న విషయం కూడా తెలియదు!!

తప్పులుంటే మన్నించండి… ధర్మమనిపిస్తే అర్ధం చేసుకోండి… జరిగిన సంఘటనను వీలైనంత త్వరగా మరిచిపోవడం మాత్రం మరిచిపోకండి…!
ఇట్లు,
– భారతీయుడు!

Read more RELATED
Recommended to you

Latest news