నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు కారణమంటూ ఓ లాయర్ కేసు పెట్టాడు. సల్మాన్‌ఖాన్, కరన్ జోహార్, సంజయ్ లీలా భన్సాలీ, ఏక్తా కపూర్ తదితర బాలీవుడ్ ప్రముఖులపై బీహార్ ముజఫర్‌పుర్ కోర్టులో అక్కడి సుధీర్ కుమార్ ఓఝా అనే ఓ లాయర్ ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు వారిపై ఐపీసీ సెక్షన్లు 306, 109, 504, 506 కింద కేసులు పెట్టామని ఆయన తెలిపారు.
లాయర్ సుధీర్ కుమార్ ఓఝా ఈ విషయంపై మీడియాతో మాట్లాడుతూ.. సుశాంత్ సింగ్ రాజ్‌పూత్‌ను 7 సినిమాల నుంచి తొలగించారని ఆరోపించారు. అలాగే అతని సినిమాలు రిలీజ్ కాకుండా చేశారన్నారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన తెలిపారు. కాగా ఇదే విషయంపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు సంజయ్ నిరుపమ్ స్పందిస్తూ.. సుశాంత్ 7 సినిమాలను నష్టపోయాడని, అది కూడా 6 నెల్లలోనే ఇది జరిగందని అన్నారు. ఇలా ఎందుకు జరుగుతుందని ప్రశ్నించారు. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ ఇష్టారీతిన వ్యవహరిస్తుందని ఆరోపించారు. సుశాంత్ లాంటి చక్కని టాలెంట్ ఉన్న వ్యక్తిని వారు బలి తీసుకున్నారన్నారు. ఈ మేరకు సంజయ్ ట్వీట్ చేశారు.
కాగా జూన్ 14వ తేదీన సుశాంత్ ముంబైలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోగా.. ఆ రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ స్పందిస్తూ.. ముంబై పోలీసులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారని, వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. అయితే మరోవైపు సుశాంత్ మృతిపై ప్రేక్షకులు తీవ్రంగా స్పందిస్తున్నారు. బాలీవుడ్ పెద్ద తలకాయలను వారు తీవ్రంగా విమర్శిస్తున్నారు. వారి వల్లే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తున్నారు. ఇక సుశాంత్ మరణంపై కంగనా రనౌత్, అభినవ్ కశ్యప్, ప్రకాష్ రాజ్ వంటి నటీనటులు స్పందిస్తూ.. బాలీవుడ్‌లో ఉన్న బంధుప్రీతిపై విమర్శలు చేశారు. ఓ వర్గానికి చెందిన వారి వల్లే సుశాంత్ చనిపోయాడని వారు సైతం ఆరోపించారు.