మణిపుర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి అత్యాచారం చేసిన ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో నలుగురు నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. నిందితులకు కోర్టు.. 11 రోజుల కస్టడీ విధించినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వస్తుండగా.. మణిపుర్ లోనూ ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి.
ఇప్పటికే ఈ ఘటనలో ప్రధాన నిందితుడి ఇంటికి నిప్పు పెట్టిన గ్రామస్థులు తాజాగా మరో నిందితుడి ఇంటిపై విరుచుకుపడ్డారు. థౌబల్ జిల్లాకు చెందిన ఆ నిందితుడి ఇంటికి స్థానికులు నిప్పంటించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న అతడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు చెప్పారు.
ఈ ఘటనను ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టినట్లు సీఎం బీరేన్ సింగ్ శుక్రవారం తెలిపారు. రాష్ట్ర ప్రజలు మహిళలను తమ తల్లిలా భావిస్తారని.. కానీ, ఈ ఘటనతో నిందితులు రాష్ట్ర ప్రతిష్ఠను దిగజార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని పునరుద్ఘాటించారు.