దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి 13 నెలలుగా జైల్లో ఉన్న దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోదియా తాజాగా ఓ లేఖ రాశారు. తాను త్వరలో జైలు నుంచి బయటకు వస్తానని తమ నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి రాసిన లేఖలో పేర్కొన్నారు. గతంలో స్వాతంత్య్రం కోసం పోరాడినట్లే తమ పార్టీ పిల్లలకు మంచి విద్య, పాఠశాలల కోసం పోరాడుతోందని తెలిపారు.
“బ్రిటిష్ వారు కూడా ఇలాగే తప్పుడు కేసుల్లో మహాత్మా గాంధీని, నెల్సన్ మండేలాను జైల్లో పెట్టారు. మనం చేసే పోరాటం వల్ల ఏదో ఒకరోజు ప్రతి ఒక్కరూ సరైన, మంచి విద్యను పొందుతారు. భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే మంచి పాఠశాలలు, విద్య అవసరం. అనారోగ్యంతో బాధపడుతున్న నా భార్యను జాగ్రత్తగా చేసుకుంటున్నందుకు నియోజకవర్గ ప్రజలందరికీ కృతజ్ఞతలు. నేను మిమ్మల్ని త్వరలో బయట కలుస్తాను’’ అని లేఖలో మనీష్ సిసోదియా పేర్కొన్నారు. మరోవైపు గత నెలలో ఇదే కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.