మన దేశంలో ప్రజారోగ్యం ఎంతటి దుర్భర పరిస్థితిలో ఉందో అందరికీ తెలిసిందే. కోవిడ్ వల్ల అసలు దేశంలో ఉన్న వైద్య ఆరోగ్య వసతుల పరిస్థితి తెలుస్తోంది. కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంటే మరోవైపు హాస్పిటళ్లలో సదుపాయాలు మాత్రం లభించడం లేదు. పైగా కొన్ని చోట్ల స్కాములు, దోపిడీలు జరుగుతున్నాయి.
రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు, కరోనా హాస్పిటల్ బిల్లుల పేరిట ప్రయివేటు హాస్పిటల్స్ దోచుకుంటుంటే వైద్య రంగంలో స్కాములు కూడా జరుగుతున్నాయి. చెన్నైలోని మడంపక్కమ్ అనే ప్రాంతానికి చెందిన వినోద్ విక్టర్ ఆంటోనీ అనే వ్యక్తి తండ్రి గతేడాది సెప్టెంబర్ 22వ తేదీన చనిపోయాడు. ఇక అతని భార్య ప్రస్తుతం అతని దగ్గర లేదు. కానీ తన భార్యకు కోవిడ్ పాజిటివ్ అని, తన తండ్రికి కోవిడ్ నెగెటివ్ అని అతనికి మెసేజ్‌లు వచ్చాయి. దీంతో అతను ఖంగు తిన్నాడు.
ఎప్పుడో చనిపోయిన అతనికి ఇప్పుడు కోవిడ్ నెగెటివ్ రావడం ఏమిటి ? అసలు తన భార్య ఆ ప్రాంతంలో లేనే లేదు, టెస్టులు చేయించుకోలేదు, అలాంటప్పుడు ఆమెకు కోవిడ్ పాజిటివ్ రావడం ఏమిటని అతను ఆందోళన చెందుతూ ఈ విషయంపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వారు అసలు ఏం జరిగింగో తెలుసుకునే పనిలో పడ్డారు. ఈ విషయమై ఆంటోనీ మాట్లాడుతూ ఎవరో తమ పేర్లను వాడుకుని ఉండవచ్చని, అందుకనే ఇలా జరిగి ఉంటుందని, ఇలా ప్రజల వివరాలను సేకరించి ఎవరైనా స్కాములు కూడా చేస్తూ ఉండవచ్చని అతను అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఏది ఏమైనా.. వైద్య రంగంలో ఉన్న డొల్ల తనానికి ఇదొక ఉదాహరణ మాత్రమే అని చెప్పవచ్చు.