ఒక వలస కార్మికుడు కుక్కలు ఉంచే గదిలో అద్దెకు నివసిస్తున్నాడు. ఆ ఇరుకు గదికి నెలకు రూ.500 అద్దె చెల్లిస్తున్నాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది. కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన శ్యామ్ సుందర్ నాలుగేళ్ల కిందట కేరళకు వచ్చాడు. వలస కార్మికుడిగా పని చేస్తున్నాడు. అయితే గత మూడు నెలలుగా పిరవోమ్‌లోని ఒక ఇంటి ఆవరణలో ఉన్న పాత డాగ్ కెన్నెల్‌లో అతడు నివసిస్తున్నాడు. ఆ ఇరుకైన కుక్కల గదికి నెలకు రూ.500 అద్దె చెల్లిస్తున్నాడు.
ఈ విషయం మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. కుక్కలు ఉంచే గదిలో అద్దెకు నివసిస్తున్న వలస కార్మికుడు శ్యామ్ సుందర్‌ను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. మరోవైపు తన ఇష్టప్రకారమే పాత డాగ్ కెన్నెల్‌లో ఉంటున్నట్లు వలస కార్మికుడు శ్యామ్ సుందర్ తెలిపాడు. ఎక్కువ అద్దె చెల్లించే స్థోమత తనకు లేదని చెప్పాడు. అందుకే నెలకు రూ.500 అద్దె చెల్లించి కుక్కల గదిలో నివసిస్తున్నట్లు పోలీసులకు తెలిపాడు.