ఢిల్లీ వేదికగా నిరసనకు సిద్ధమైన వైసీపీ

-

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న హత్యలు, దాడులు, హింసాత్మక ఘటనలపై దేశ రాజధానిలో నిరసనకు వైసీపీ సిద్ధమైంది. రాజకీయ కక్షలను ఉపేక్షించేదిలేదని ఖరాకండీగా చెప్తోంది. ఇదే అంశంపై కూటమి సర్కార్‌కు, వైసీపీకి మధ్య వార్ ముదురుతోంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 36 రాజకీయ హత్యలు జరిగాయని వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ మేరకు హత్యలు, దాడులపై గవర్నర్ కు సైతం ఫిర్యాదు చేశారు.

గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల వినుకొండలో జరిగిన రషీద్ అనే యువకుడి హత్య ఘటన, పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డిపై రాళ్ల దాడి, తదితర సంఘటలపై గవర్నర్‌ ను కలిసి వినతిపత్రం ఇచ్చారు.ఆయా ఘటనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను కూడా గవర్నర్‌కు అందించారు. రాష్ట్రంలో దెబ్బతిన్న లా అండ్ ఆర్డర్ ను పునరుద్ధరించేందుకు గవర్నర్ చర్యలు తీసుకోవాలని జగన్ కోరారు.

గవర్నర్ ను కలిసి వినతులు అందించిన జగన్ ఇక ఢిల్లీ వేదికగా పోరాటం చేసేందుకు సిద్ధమయ్యారు. కూటమి ప్రభుత్వ హయాంలో తమ పార్టీ క్యాడర్‌, నేతలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ.. జూలై 24న న్యూఢిల్లీలో పార్టీ నిర్వహించనున్న నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించారు. రాష్ట్రంలో జరిగిన హత్యలు, దాడులపై గట్టిగా గళం వినిపించేందుకు రావాలని కోరారు. దేశ రాజధానిలో జరిగే పోరాటంలో భాగస్వామ్యం కావాలని విపక్ష పార్టీలను జగన్ ఆహ్వానించడం హాట్ టాపిక్ గా మారింది. దేశ రాజధానిలో నిరసన నిర్వహించడం ద్వారా గత 45 రోజులలో రాష్ట్రంలోని విపత్కర పరిస్థితిని దేశం ముందు ప్రదర్శించాలనుకుంటున్నాని.. పోరాటంలో భాగస్వామ్యం కావాలని జగన్ కోరినట్లు సమాచారం.

జగన్ తమ పోరాటంలో భాగస్వామ్యం కావాలని ఏపీలోని అన్ని పార్టీలను ఆహ్వానించడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, దాడులు, ఆస్తుల విధ్వంసానికి వ్యతిరేకంగా పార్లమెంటు ఉభయ సభల్లో వైసీపీ ఎంపీలు గళం విప్పనున్నారు. ఇప్పటికే.. బడ్జెట్ సమావేశాలకు ముందు జరిగిన భేటీలో వైసీపీ ఫిర్యాదు చేసింది. అలాగే ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టారు. ఈ సమావేశాల్లో ఎలాగైనా హోదా సాధించేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తామని ఎంపీలు చెప్తున్నారు.మొత్తానికి ఎన్నికల్లో ఓడినా ప్రజల క్షేమమే లక్ష్యంగా వైసీపీ పనిచేస్తుందని ఏపీ ప్రజలు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news