ఈశాన్య రాష్ట్రం మిజోరంలో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. ఆ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ‘జోరం పీపుల్స్ మూవ్‌మెంట్- ZPM’ పార్టీ అధ్యక్షుడు లాల్‌దుహోమా ఈరోజు ప్రమాణం స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ డా.కంభంపాటి హరిబాబు అయిజోల్‌లోని రాజ్‌భవన్ కాంప్లెక్స్‌లో లాల్‌తో ప్రమాణం స్వీకారం చేయించారు. లాల్‌దుహోమాతో పాటు ఎమ్మెల్యేలుగా గెలుపొందిన ఇతర జెడ్‌పీఎం నేతలు కొందరితో మంత్రులుగా ప్రమాణం చేశారు. మరోవైపు జెడ్‌పీఎం పార్టీ నాయకుడిగా లాల్ దుహోమాను, ఉపాధ్యక్షుడిగా కె.సప్దంగను పార్టీ నేతలు ఎన్నుకున్నారు. 2018 ఎన్నికల్లో 8 స్థానాలు గెలుచుకున్న జెడ్‌పీఎం ఈసారి జరిగిన ఎన్నికల్లో 27 స్థానాలను కైవసం చేసుకుంది.
8.57 లక్షల మంది ఓటర్లున్న మిజోరంలో నవంబర్ 7న పోలింగ్ నిర్వహించగా.. ఇందులో 80 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 18 మంది మహిళలతో పాటు మొత్తం 174 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. జెడ్‌పీఎం, ఎంఎన్‌ఎఫ్, కాంగ్రెస్ 40 స్థానాల్లో పోటీ చేయగా.. బీజేపీ 23 స్థానాల్లో మాత్రమే తమ అభ్యర్థులను ఎన్నికల్లో నిలబెట్టింది. ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తొలిసారి నాలుగు స్థానాల్లో అభ్యర్థులను దింపగా.. ఒక్కసీటు కూడా గెలవలేకపోయింది.