కాంగ్రెస్‌పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి తీవ్రంగా విరుచుకుపడ్డారు. గత యూపీఏ పాలనపై మోదీ ధ్వజమెత్తారు. యూపీఏ సర్కార్ తమ స్కామ్‌లతో బ్యాంకింగ్ రంగాన్ని సర్వనాశనం చేసిందని దుయ్యబట్టారు. ఆ స్కామ్‌ల వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులు భారీ నష్టాలు మూటగట్టుకున్నాయని అన్నారు. తమ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాతే బ్యాంకులు నెమ్మదిగా కోలుకున్నాయని చెప్పారు. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో బ్యాంకింగ్ రంగం బలోపేతమవుతోందని మోదీ తెలిపారు. వచ్చే 25 ఏళ్లు భారత్‌కు చాలా కీలకమని అన్నారు.
‘రోజ్‌గార్ మేళా’లో భాగంగా మోదీ ఈరోజు.. మరో 70వేలకు మందికి పైగా నియామక పత్రాలను అందజేశారు. అనంతరం వర్చువల్‌గా ప్రధాని ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తారు. ఫోన్ బ్యాంకింగ్ (బ్యాంకులకు ఫోన్లు చేసి)తో ఆ ప్రభుత్వం రూ.వేల కోట్ల రుణాలను వారికి అనుకూలంగా ఉన్న కొందరు శక్తిమంతమైన నేతలు, కుటుంబాలకు మంజూరు చేయించిందని మోదీ ఆరోపించారు. ఆ రుణాలు తిరిగి రాకపోవడం వల్లే ప్రభుత్వ రంగ బ్యాంకులు భారీ నష్టాలను చవిచూశాయి. నిరర్ధక ఆస్తులు విపరీతంగా పెరిగాయని అన్నారు.