ఫిబ్రవరి నుంచి మే వరకు రాజ్యసభలో 68 మంది ఎంపీలు పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఇవాళ వారికి సభలో వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ.. మాజీ ప్రధాని, కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్‌పై ప్రశంసలు కురిపించారు. ఆయన ఎంపీలందరికీ ఆదర్శమని కొనియాడారు. ఈ దేశానికి మన్మోహన్ చేసిన సేవ అపారమని, సుదీర్ఘకాలం పాటు రాజ్యసభకు ఆయన అందించిన సహకారం, దేశాన్ని నడిపించిన తీరు ఎప్పటికీ గుర్తుంటుందని అన్నారు.
రాజ్యసభలో జరిగిన ఎన్నికల సమయంలో ట్రెజరీ బెంచ్ గెలుస్తుందని తెలిసినప్పటికీ ఆయన వీల్‌ఛైర్‌లో వచ్చి ఓటు వేశారని ప్రజాస్వామ్యం బలోపేతానికి కృషి చేశారని అన్నారు. ఓ సభ్యుడిగా తన విధుల విషయంలో మన్మోహన్ ఎంత బాధ్యతగా ఉన్నారనడానికి ఇదొక ఉదాహరణ అని తెలిపారు. ఈ సందర్భంగా కేంద్రానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ విడుదల చేసిన బ్లాక్ పేపర్‌ను మోదీ ప్రస్తావించారు. ఆ పత్రం తమ ప్రభుత్వానికి దిష్టి చుక్క లాంటిదని అన్నారు. తమపై చెడు చూపు పడకుండా అది చేస్తుందని చమత్కరించారు.