ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు బీహార్ మాజీ సీఎం, ఆర్జెడి చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్. ఇటీవల ప్రతిపక్షాల ఇండియా కూటమిపై మోడీ విమర్శలకు లాలూ కౌంటర్ ఇస్తూ.. వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రధాని మోదీ విదేశాలలో స్థిరపడతారని అన్నారు. మోదీ దేశాన్ని విడిచే ప్రణాళికల్లో భాగంగానే విదేశీ పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు.
పిజ్జాలు, మోమోలు తింటూ విశ్రాంతి తీసుకునేందుకు అనువైన ప్రదేశాలను ఆయన వెతుకుతున్నారని ఎద్దేవా చేశారు. ఇక మణిపూర్ హింసకు కేంద్రం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు లాలు. రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆగస్టులో ముంబైలో ప్రతిపక్షాలకు కూటమి మూడో సమావేశం జరగనుందని.. ఈ సమావేశానికి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో కలిసి తాను హాజరవుతానని తెలిపారు.