అమెరికాలోని చికాగోలో ఆకలితో తన బిడ్డ అలమటిస్తోందని ఓ తల్లి తెలంగాణ ముంచి విదేశాంగ మంత్రి జైశంకర్‌కు లేఖ రాశారు. వీలైనంత త్వరగా తన కుమార్తెను భారత్‌కు రప్పించేందుకు సాయం చేయాలని ఆమె లేఖలో అభ్యర్థించారు. ఈ లేఖను బీఆర్ఎస్ నేత ఖలీకర్ రెహమాన్ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు.
హైదరాబాద్‌లోని మౌలాలికి చెందిన సయ్యదా లులు మిన్హాజ్ జైదీ మాస్టర్స్ చేసేందుకు 2021 ఆగస్టులో అమెరికాకు వెళ్లారు. రెండు నెలలుగా కూతురు నుంచి ఫోన్ కాల్ రాకపోవడంతో హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్లిన కొందరికి తన కుమార్తె సమాచారం అందించాలని కోరారు. వారు ఆమెను గుర్తించి సయ్యదా తల్లికి కాల్ చేశారు. ఆమె వస్తువులను ఎవరో దొంగలించారని.. దీంతో చికాగో రోడ్లపై ఆకలితో అలమటిస్తోందని సమాచారం అందించారు. అంతేకాకుండా లులు మిన్హాజ్ మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న సయ్యదా తల్లి ఫాతిమా తన కుమార్తెను భారత్‌కు తీసుకురావాలని కేంద్రమంత్రికి లేఖ రాశారు.