ఇండియా కూటమి లోక్‌సభలో ప్రవేశపెట్టింది అవిశ్వాస తీర్మానం కాదని.. విపక్షాల విశ్వాస తీర్మానమని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే అన్నారు. లోక్ సభలో ఉన్నవాళ్లల్లో చాలామంది మణిపుర్ వెళ్లి ఉండరని.. ఈ సభలో ఉన్న చాలామందికి మణిపుర్ గురించి తెలియదని.. అసలు మణిపుర్ గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్‌కు లేనేలేదని అన్నారు. రాహుల్‌గాంధీ ఎప్పటికీ సావర్కర్ కాలేరని చెప్పారు. ఇండియా కూటమిలో చాలా మందికి దాని అర్థమే తెలియదని ఎద్దేవా చేశారు.
మోదీ ఓబీసీ కాబట్టే ఆయనకు రాహుల్ క్షమాపణ చెప్పేందుకు నిరాకరిస్తున్నారని దూబే వ్యాఖ్యానించారు. ఇండియా కూటమిలో చాలామందిని కాంగ్రెస్ జైలుకు పంపిన సంగతి మర్చిపోయారా అని ప్రశ్నించారు. గతంలో పవార్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ కూల్చిందని.. లాలూ ప్రసాద్ యాదవ్‌ను కాంగ్రెస్ గతంలో జైలుకు పంపిందన్నారు. ఇండియా కూటమిలో చాలా పార్టీలకు అంతర్గత వైరం ఉందని తెలిపారు. మణిపుర్ డ్రగ్ మాఫియాను కాంగ్రెస్ గతంలో ప్రోత్సహించిందని ఆరోపించారు. న్యూస్ క్లిక్ వెబ్‌సైట్ అంశంపై మాట్లాడితే కాంగ్రెస్‌కు ఎందుకు కోపం వస్తోందని ప్రశ్నించారు.