రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ముకేశ్ అంబానీ మరో 5 ఏళ్లపాటు కొనసాగనున్నారు. ఈ మేరకు కంపెనీ షేర్ హోల్డర్లు తీర్మానం చేశారు. 2029 ఏప్రిల్ వరకు ముకేశ్ అంబానీ రిలయన్స్ హెడ్‌గా పనిచేయనున్నారు. ఈ సమయంలో ఆయన ఎలాంటి జీతం తీసుకోకుండా పని చేస్తానని ఆయన ప్రకటించారు.
రిలయన్స్ ఇండస్ట్రీని ముకేశ్ అంబానీ అత్యున్నత శిఖరాలకు తీసుకువెళ్తున్నందున.. ఆయనే కంపెనీ ఛైర్మన్ అండ్ ఎమ్‌డీగా కొనసాగించాలని షేర్ హోల్డర్లు నిర్ణయించారు. కంపెనీ లా ప్రకారం, ఒక వ్యక్తి 70 ఏళ్ల వరకు మాత్రమే ఈ పదవిలో కొనసాగగలరు. ప్రస్తుతం ముకేశ్ అంబానీ వయస్సు 66 సంవత్సరాలు. అందుకే కంపెనీ షేర్ హోల్డర్లు ప్రత్యేక తీర్మానం చేసి, ఆయనను 2029 ఏప్రిల్ వరకు రిలయన్స్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎన్నుకున్నారు. ముకేశ్ అంబానీ ప్రస్తుత టెర్మ్ 2024 ఏప్రిల్ 18తో ముగుస్తుంది. అయితే 2019 ఏప్రిల్ 19 నుంచి మరో ఐదేళ్లపాటు ఆయన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగనున్నారు.