దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కరోనా ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. రోజుకు 2 లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదవుతుండడం అత్యంత ఆందోళనను కలిగిస్తోంది. మహారాష్ట్రలో దేశంలోనే అత్యధికంగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే కరోనా కేసుల వల్ల హాస్పిటల్స్‌లో సదుపాయాలకు కొరత ఏర్పడుతోంది. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ మహారాష్ట్రకు సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు.
భారీ సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదవుతుండడం వల్ల హాస్పిటల్స్‌లో చికిత్స తీసుకునేవారికి ఆక్సిజన్ సరఫరా సరిగ్గా జరగడం లేదు. దీంతో ముకేష్ అంబానీ తన ఆయిల్ రిఫైనరీ నుంచి మహారాష్ట్రకు ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలోనే రిలయన్స్ నుంచి 100 టన్నుల ఆక్సిజన్ మహారాష్ట్రకు సరఫరా కానుందని ఆ రాష్ట్ర పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి ఏకనాథ్ షిండే ట్వీట్ చేశారు.
కోవిడ్ పేషెంట్లకు చికిత్స అందించేందుకు ఆక్సిజన్ ఎంతగానో అవసరం అవుతుంది. అయితే కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో రోగులకు హాస్పిటల్స్‌లో బెడ్లు దొరకడం లేదు. మరోవైపు చికిత్స తీసుకుంటున్న పేషెంట్లకు ఆక్సిజన్ అందడం లేదు. దీంతో దేశంలో ఉన్న పరిశ్రమల నుంచి ఆక్సిజన్‌ను సరఫరా చేయాలని కేంద్రం ఆదేశించింది. అయితే రిలయన్స్ మాత్రం మహారాష్ట్రకు ఉచితంగానే ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేస్తుండడం విశేషం.