జాతిపిత మహాత్మా గాంధీ ముని మనవడు తుషార్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా యాత్ర చేపట్టనున్న నేపథ్యంలోనే ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు ముంబయి పోలీసులు తెలిపారు. శాంతిభద్రతలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నందునే ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ప్రతి ఏడాదిలానే ఈ సంవత్సరం కూడా శాంతి యాత్ర చేపడదామకున్నానని తుషార్ గాంధీ అన్నారు. కానీ పోలీసులు దౌర్జన్యంగా తనను అరెస్టు చేశారని మండిపడ్డారు.
మరోవైపు.. తుషార్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై శివసేన(ఉద్ధవ్ వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. తుషార్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకోవడం దారుణం అని అన్నారు. బీజేపీ నేతలను ఉద్దేశిస్తూ.. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొననని వారు.. క్విట్ ఇండియా డే రోజు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేస్తున్నారని విమర్శించారు. ఇది చాలా హాస్యాస్పదంగా ఉందని సంజయ్ రౌత్ ఎద్దేవా చేశారు.