ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాలు రాజకీయ వివాదానికి దారితీస్తున్నాయి. కన్వర్ యాత్ర నేపథ్యంలో ఆ మార్గంలో ఉన్న దుకాణదారులు నేమ్ ప్లేట్లు పెట్టుకోవాలని ఈ రెండు రాష్ట్రాలు ఆదేశాలు జారీ చేశాయి. అయితే ఇది వివాదం అవుతున్నా ఇప్పుడు అదే దాదిలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. తాజాగా ఉజ్జయినిలోని హోటళ్లు, తోపుడుబండ్లపై విక్రయాలు జరిపేవారు వాటిపై తమ పేర్లను తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించింది.
క్యూఆర్‌కోడ్, ఫోన్ నంబర్‌ను కూడా జతచేయాలని మధ్యప్రదేశ్ సర్కార్ పేర్కొంది. ఈ ఆదేశాలు ఉల్లంఘించిన వారికి రూ.2,000 నుంచి రూ.5000 వేల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించింది. వారి స్టాల్స్‌ను తొలగిస్తామని తెలిపింది. యాత్రికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని, ముస్లింలు తమ లక్ష్యం కాదని వెల్లడించింది. ఉజ్జయిని హిందువులకు పవిత్రమైన నగరమని.. దుకాణాల యజమానుల వివరాలు తెలుసుకునే హక్కు భక్తులకు ఉంటుంది అని మేయర్ ముఖేష్ తత్వాల్ తెలిపారు.
ఇప్పటికే యూపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు చేపట్టిన ఈ కార్యక్రమంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత సంస్కృతిపై ఇదొక దాడి అని కాంగ్రెస్ విరుచుకుపడింది. కన్వర్ యాత్ర జులై 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ యాత్రలో భాగంగా ఏటా శ్రావణ మాసంలో పక్షం రోజుల పాటు శివ భక్తులు గంగా నదీజలాలను సేకరిస్తుంటారు.