అయోధ్య రామయ్య ఆలయ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి రంగం సిద్ధమవుతోంది. జనవరి 22వ తేదీ రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన అంగరంగ వైభవంగా జరగనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మహత్తర కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఓవైపు ప్రముఖులు మరోవైపు సామాన్య ప్రజలు అయోధ్యకు తరలిరానున్నారు.
మరోవైపు ఇప్పటికే అయోధ్య రాముడికి కానుకలు వెల్లువెత్తుతున్నాయి. అందులో ముఖ్యంగా రామయ్య అత్తగారి రాజ్యమైన జనక్ పుర్ నుంచి కానుకలు అందాయి. రాముడి అత్తగారి రాజ్యం నుంచి వెండి విల్లుతో పాటు అందమైన కానుకలు రామయ్యకు అందాయి. సీతాదేవి జన్మించిన నేపాల్‌లోని జనక్‌పుర్ నుంచి సుమారు 800 మంది భక్తులు అయోధ్యకు 500 కానుకల డబ్బాలతో వచ్చారు. వారు తీసుకొచ్చిన వాటిలో శ్రీరాముడి కోసం వెండి పాదరక్షలు, వెండి విల్లు, బాణం, కంఠహారాలు, గృహోపకరణాలు, పట్టు వస్త్రాలు ఉన్నాయి.
500 ఏళ్ల నాటి ఈ వివాదం చాలా కాలం తర్వాత సద్దుమణిగిందని జనక్ పుర్ ఆలయ పూజారి రోషన్ దాస్ అన్నారు. జనవరి 22న ప్రాణ ప్రతిష్ట జరగుతున్నందుకు తాము ఎంతో సంతోషిస్తున్నామని చెప్పారు. ఈ బంధం త్రేతాయుగానికి చెందినదని.. అప్పుడు రాముడికి, సీతమ్మకు స్వయంవర వివాహం జరిగిందని గుర్తు చేశారు. ఆ బంధం ఉంది కాబట్టే మేము ఇప్పుడు రాముడు ఇంటి ఏర్పాటుకు అవసరమైన వస్తువులను తీసుకొచ్చామని ఆయన వెల్లడించారు.