పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి విజయకేతనం ఎగురవేయాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలోనే అన్ని రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర నాయకత్వం కూడా ఈ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించింది. జాతీయ నాయకత్వం నిర్దేశించిన 10 ఎంపీ, 35 శాతం ఓట్ల సాధించడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది.
పార్లమెంట్ నియెజకవర్గాలకు ఇంఛార్జీలను నియమించిన తెలంగాణ బీజేపీ నాయకత్వం 8 మంది ఎమ్మెల్యేలు, ఒక్క ఎమ్మెల్సీకి బాధ్యతలు అప్పగించింది. మరోవైపు ఎన్నికల సమన్వయయం కోసం పార్లమెంట్ కన్వీనర్లతో పాటు ఆర్గనైజేషన్ ఇంఛార్జీలను నియమించాలని యోచిస్తోంది. జిల్లా అధ్యక్షులతో పాటు రాష్ట్ర పదాధికారుల్లో మార్పులు, చేర్పులకు శ్రీకారం చుట్టిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి.. 15 నుంచి 20 జిల్లాల అధ్యక్షులను మార్చాలని నిర్ణయించారు. ఇప్పటికే జిల్లా అధ్యక్షుల పేర్లను ఖరారు చేసి, జాతీయ నాయకత్వానికి ఆయన అందజేశారు.
మరోవైపు ఈ నెలాఖరుకు ప్రధాని మోదీ అధికారిక పర్యటనలో భాగంగా రాష్ట్రానికి రానున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో పార్టీ తరఫున సభలు పెట్టాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఫిబ్రవరి ప్రథమార్థం కల్లా లోక్ సభ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించి ప్రజా క్షేత్రంలో ప్రచారాన్ని ఉద్ధృతం చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు.