కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో విపక్ష పార్టీలు పాలించే రాష్ట్రాలపై వివక్ష చూపారని ఇండియా కూటమి ఆరోపించింది. ఈ ఆరోపణలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీటుగా స్పందించారు. ఇవాళ రాజ్యసభలో ప్రసంగించిన ఆమె.. బడ్జెట్ ప్రసంగంలో అన్ని రాష్ట్రాల పేర్లను చెప్పలేమంటూ మండిపడ్డారు.
కేంద్రం ప్రవేశపెట్టే ప్రతీ బడ్జెట్‌లో దేశంలోని అన్ని రాష్ట్రాల పేర్లను ప్రస్తావించే అవకాశం రాదని నిర్మలా సీతారామన్ అన్నారు. మహారాష్ట్రలోని వందవన్‌లో పోర్ట్‌ను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని.. కానీ, బడ్జెట్‌లో మహారాష్ట్ర పేరును చెప్పలేదని.. అలాగని.. తమను విస్మరించారని ఆ రాష్ట్రం భావిస్తోందా? అంటూ విపక్షాలను ప్రశ్నించారు. బడ్జెట్ ప్రసంగంలో ఓ రాష్ట్రం పేరును ప్రస్తావించనంత మాత్రాన.. కేంద్రం నుంచి వారికి నిధులు వెళ్లవా? అని నిలదీశారు. విపక్షాలది దారుణమైన ఆరోపణ అని మండిపడ్డారు. తమ రాష్ట్రాలకు ఏమీ ఇవ్వలేదన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించాలని ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి కుట్రలు చేస్తున్నాయని నిర్మలా సీతారామన్ రాజ్యసభలో విపక్షాలపై ధ్వజమెత్తారు.