బిహార్ రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. గత కొన్నిరోజులుగా ఆ రాష్ట్ర సీఎం నీతీశ్ కుమార్ మహాకూటమిని వీడబోతున్నట్లు వస్తున్న వార్తలు ఎట్టకేలకు నిజమయ్యాయి. తాజాగా నీతీశ్ సీఎం పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్కు అందజేశారు. నీతీశ్ కుమార్ రాజీనామాను బిహార్ గవర్నర్ ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని సూచించారు. గవర్నర్కు రాజీనామా సమర్పించిన అనంతరం రాజ్భవన్ నుంచి బయటకు వచ్చిన నీతీశ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.
బిహార్ సీఎం పదవికి రాజీనామా చేసి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని గవర్నర్‌ను కోరానని ఈ సందర్భంగా నీతీశ్ తెలిపారు.అన్ని వర్గాల సూచనలు పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మహాకూటమిలో పరిస్థితులు సరిగా లేవని అన్నారు. నేతల వైఖరి సరిగా లేనందున చాలామంది ఇబ్బంది పడ్డారని చెప్పారు. ఈ క్రమంలోనే మహాకూటమితో సంబంధాలు తెంచుకోవాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. మరోసారి బీజేపీతో జతకట్టేందుకు సిద్ధమైనట్లు నీతీశ్ కుమార్ స్పష్టం చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు గవర్నర్ తనను సీఎంగా కొనసాగమని చెప్పినట్లు తెలిపారు.