రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏను ఎలాగైనా ఓడించేందుకు విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి మరీ కార్యాచరణ సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఉమ్మడిపోరుకు కట్టిన జట్టుకు ఇండియాగా నామకరణం కూడా చేశారు. ఈ పేరును కూటమిలోని అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో సమ్మతించాయని విపక్ష నేతలు తెలిపారు. కానీ.. బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ మాత్రం ఈ పేరును వ్యతిరేకించినట్లు టాక్. ఇతర పార్టీల నేతలు సర్దిచెప్పడంతో చివరకు ఆయన అంగీకరించినట్లు పేర్కొన్నాయి.
ప్రతిపక్షాల కూటమి పేరు గురించి కాంగ్రెస్ ముందుగా ఎలాంటి చర్చలు జరపలేదట. విపక్ష నేతల భేటీ సమయంలో ఉన్నట్టుండి ‘ఇండియా (INDIA)’ అనే పేరును ఆ పార్టీ నేతలు ప్రతిపాదించారని సదరు వర్గాలు తెలిపాయి. ఆ పేరు వినగానే నీతీశ్ కుమార్ షాక్ అయ్యారని .. ‘‘ప్రతిపక్షాల కూటమికి INDIA అనే పేరు ఎలా పెడతారు? పైగా ఇందులో బీజేపీకి చెందిన NDA కూటమి అక్షరాలున్నాయి?’’ అని ఆయన ప్రశ్నించినట్లు తెలుస్తోంది.