కొంత మంది రోగులు చికిత్స చేయించుకుంటున్నప్పుడు వైద్యులతో దురుసుగా ప్రవర్తిస్తుంటారు. ఇక కొంత మంది రోగులు ఏకంగా వారిపై దాడికి తెగబడతారు. మరోవైపు రోగుల బంధువులు వైద్యులపై పలు కారణాలతో దాడులు చేసిన ఘటనలో ఎన్నో చూశాం. ఇలాంటివి రోజురోజుకు పెరిగిపోతున్నాయి కూడా. ఈ క్రమంలోనే గతంలో నేషనల్ మెడికల్ కమిషన్ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టిషనర్స్ నియమావళి పేరుతో రూపొందించిన నిబంధనలను అమల్లోకి తీసుకొస్తున్నట్లు ఎన్‌ఎంసీ తెలిపింది.
ఈ నిబంధనల ప్రకారం.. ఇకపై వైద్యులతో అనుచితంగా ప్రవర్తించే రోగులకు చికిత్స నిరాకరించవచ్చని ఎన్‌ఎంసీ వెల్లడించింది. వైద్యులపై హింసను అరికట్టడమే లక్ష్యంగా ఈ నిబంధనలు అమల్లోకి తీసుకొస్తున్నట్లు ఎన్‌ఎంసీఆర్‌ఎంపీ పేర్కొంది. ఇకపై కోడ్ ఆఫ్ మెడికల్ ఎథిక్స్ 2002 స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన ఎన్‌ఎంసీఆర్‌ఎంపీ రెగ్యులేషన్ 2023 అమల్లోకి రానుంది. అయితే, అత్యవసర సేవల విషయంలో మాత్రం ఈ నిబంధన వర్తించదని తెలిపింది.
ఒకవేళ రోగి లేదా వారి బంధువులు దురుసుగా, హింసాత్మకంగా వ్యవహరిస్తే.. వారి ప్రవర్తన గురించి రికార్డులో రాసి.. వేరేచోట తదుపరి చికిత్స చేయించుకునేలా వైద్యులు వారికి సూచించాలని తెలిపింది. ప్రాణాపాయ పరిస్థితులు మినహా వైద్యులు ఎవరికి చికిత్స అందించాలనేది పూర్తిగా వారి స్వీయ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని పేర్కొంది.