భారత్ వేదికగా ఈ ఏడాది సెప్టెంబరులో జరగనున్న జీ-20 శిఖరాగ్ర సదస్సులో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ పాల్గొనే అవకాశాలు దాదాపుగా కనిపించడం లేదు. ఈ సదస్సుకు హాజరయ్యే జాబితాలో ఉక్రెయిన్ లేకపోవడం గమనార్హం. ఆ సమావేశాలకు ఏయే దేశాలను ఆహ్వానిస్తున్నామన్నది ఇప్పటికే స్పష్టం చేసిన సంగతిని మన దేశం తాజాగా గుర్తుచేసింది.
జీ-20 శిఖరాగ్ర సదస్సులో ప్రసంగించే అవకాశం లభిస్తే జెలెన్స్కీ చాలా సంతోషిస్తారంటూ ఉక్రెయిన్ ఫస్ట్ డిప్యూటీ విదేశాంగ మంత్రి ఎమైన్ జపరోవా దిల్లీలో మంగళవారం వ్యాఖ్యానించారు. భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీని ఈ వ్యాఖ్యలపై దిల్లీలో విలేకర్లు గురువారం ప్రశ్నించారు. దీంతో బాగ్చీ స్పందిస్తూ.. ‘‘జీ-20 సదస్సుకు ఎవరెవర్ని ఆహ్వానిస్తున్నామో భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి వినయ్ క్వాత్రా గతంలోనే నిర్దిష్టంగా తెలియజేశారు. ‘ఆ జాబితాను విలేకర్లకు అందజేశాం కూడా. అందులో ప్రస్తుతం మేము మార్పులేవీ చేయలేదు’’’ అని పేర్కొన్నారు.