ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం రోజురోజుకు తీవ్ర తరంగా మారుతోంది. ఇప్పటికే ఇజ్రాయెల్ పై హమాస్ ముష్కరులు భీకర దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్ ను నామరూపాల్లేకుండా చేయాలని శపథం చేసింది. ఆ దిశగా గాజాలోకి చొరబడి దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో యుద్ధభూమి నుంచి భారతీయులను స్వదేశానికి తరలించడం కోసం మోదీ సర్కార్ ఆపరేషన్ అజయ్ ను ప్రారంభించింది.
ఇందులో భాగంగా ఇజ్రాయెల్ నుంచి మొదటి విమానం 212 మంది భారతీయులతో శుక్రవారం ఉదయం దిల్లీలో ల్యాండ్ అయింది. తాజాగా మరో విమానం దేశ రాజధానిలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. 235 మంది ఈ విమానంలో ఇండియాకు వచ్చారు. దిల్లీలో దిగిన వెంటనే వారంతా వందేమాతరం నినాదాలు చేశారు. యుద్ధభూమి నుంచి తమను సురక్షితంగా ఇండియాకు తీసుకువచ్చినందుకు మోదీ ప్రభుత్వానికి వారంతా ధన్యవాదాలు చెప్పారు. ఇజ్రాయెల్ లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని.. ఇప్పటికీ అక్కడ రాకెట్ల మోత మోగుతోందని.. ప్రాణాలతో బయటపడతామని ఊహించలేదని అన్నారు.