రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో ఎలాగైనా బీజేపీని గద్దె దింపాలనే లక్ష్యంతో ఇవాళ వివిధ పార్టీలకు చెందిన విపక్ష నేతలు బిహార్ రాజధాని పట్నాలో భేటీ కానున్నారు. ఈ సమావేశానికి బిహార్ సీఎం నితీశ్ కుమార్ అధ్యక్షత వహించనున్నారు. ఇప్పటికే పలువురు కీలక నేతలు పట్నా చేరుకున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. తామంతా కలిసి ఎన్డీయేపై ఒక ఉమ్మడి కుటుంబంలా పోరాడతామని పేర్కొన్నారు. అయితే ఈ కీలక సమావేశానికి ముందు భిన్నస్వరాలు వినిపిస్తుండటం గమనార్హం.
ఉత్తర్‌ప్రదేశ్ నుంచి ఒక్క సమాజ్‌వాదీ పార్టీ మాత్రమే హాజరుకానుండడం కూడా చర్చనీయాంశమైంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తమిళనాడు సీఎం స్టాలిన్ (డీఎంకే) పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ(టీఎంసీ), దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ (ఆప్), ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ (జేఎంఎం) సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే (శివసేన-యూబీటీ) ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్ తదితరులు హాజరు కానున్నారు.