లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికారులు దేశవ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశారు. ఎన్నికల్లో ప్రజలు ప్రలోభాలకు గురి కాకుండా ఎక్కడికక్కడ నగదు, మద్యం అక్రమ రవాణాను అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో ఎన్నికల వేళ కర్ణాటకలో భారీగా అక్రమ నగదు, బంగారం బయటపడింది. బళ్లారిలోని ఓ వ్యాపారి ఇంట్లో పోలీసులు సోదాలు జరపగా.. రూ.7.6 కోట్ల నగదు, బంగారు, వెండి ఆభరణాలను దొరికాయి.
బళ్లారిలో హవాలా కార్యకలాపాలు జరుగుతున్నట్లు వచ్చిన సమాచారంతో బ్రూస్‌పేట్ పోలీసులు స్థానిక ఆభరణాల వ్యాపారి నరేశ్ సోనీ ఇంట్లో ఆకస్మిక సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో లెక్కల్లోకి రాని భారీ నగదు, ఆభరణాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. రూ.5.6 కోట్ల కరెన్సీ, 103 కిలోల వెండి ఆభరణాలు, 68 వెండి కడ్డీలు, 3 కిలోల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. హవాలా మార్గంలో వీటిని తీసుకొచ్చి ఉంటారన్న అనుమానంతో దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు. వ్యాపారి నరేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు ఈ వివరాలను ఆదాయపు పన్ను విభాగానికి అందజేస్తామని తెలిపారు.