పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు 2024-25 ఇవాళ్టి నుంచి ప్రారంభం అవుతాయి. ప్రస్తుత 17వ లోక్‌సభకు ఇవే చివరి సమావేశాలు కానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి ఈరోజు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగిస్తారు. ఈ ప్రసంగంతోనే ఈ సమావేశాలు మొదలవుతాయి. ఫిబ్రవరి 9వ తేదీతో బడ్జెట్ సమావేశాలు ముగుస్తాయి. రాష్ట్రపతి ప్రసంగం, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమర్పణ, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, ప్రధాని నరేంద్రమోదీ సమాధానంతో సమావేశాలు ముగియనున్నాయి.
ఏప్రిల్-మే నెలలో జరిగే సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ఫిబ్రవరి ఒకటిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. అలాగే రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్ముకశ్మీర్ వార్షిక పద్దును కూడా ప్రవేశపెడతారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత అధికారం చేపట్టే ప్రభుత్వం జులైలో మళ్లీ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతుంది. మరోవైపు ఈసారి ప్రవేశపెట్టే బడ్జెట్తో కేంద్ర ఆర్థిమంత్రిగా నిర్మలాసీతారామన్ ఆరుసార్లు పద్దు ప్రవేశపెట్టినట్లవుతుంది. దీని ద్వారా ఆమె మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డును సమం చేయనున్నారు.