తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో పతంజలి ఆయుర్వేద సంస్థ సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పింది. ధిక్కార పిటిషన్‌పై సమాధానం ఇవ్వకపోవడంతో రెండు రోజుల క్రితం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన రామ్‌దేవ్ బాబా, మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణకు సమన్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజా స్పందన వచ్చింది.
ఆధునిక వైద్యవిధానాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ పతంజలి ఆయుర్వేద సంస్థపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆ సంస్థను మందలించింది. ఇకపై ఎలాంటి ఉల్లంఘనలూ జరగవంటూ అప్పట్లో సంస్థ తరఫున న్యాయవాది కోర్టుకు వెల్లడించి మరీ, ఆ హామీని ఉల్లంఘించడంపై గత నెల కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలపాలంటూ రామ్‌దేవ్ బాబాకు, ఆచార్య బాలకృష్ణకు నోటీసులు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో పతంజలి సంస్థ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తూ న్యాయవ్యవస్థ పట్ల అత్యంత గౌరవం ఉందని బాలకృష్ణ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆ తరహా ప్రకటనలు జారీ చేయకుండా చూసుకుంటామని చెప్పారు.