పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆర్‌బీఐ ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షల నుంచి బయటపడేందుకు ఆ కంపెనీ నానా తంటాలు పడుతోంది. ఇందులో భాగంగానే వివిధ రకాల మార్గాలను అన్వేషిస్తోంది. అయితే ఈ విషయంపైనే తాజాగా ఆ కంపెనీ సీఈవో విజయ్ శేఖర్ శర్మ కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించినట్లు తెలుస్తోంది. మంగళవారం రోజున విజయ్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమైనట్లు సమాచారం.
అయితే ఈ వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకునేది ఏమీ లేదని .. డైరెక్ట్ ఆర్‌బీఐతోనే సమస్యను పరిష్కరించుకోవాలని, వారి మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాలని నిర్మలా సీతారామన్ సూచించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు, రెగ్యులేటరీ ఆంక్షలపై చర్చించేందుకు ఆర్‌బీఐ అధికారులతోనూ విజయ్ శర్మ సమావేశమైనట్లు తెలుస్తోంది.
ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎంకు చెందిన పేమెంట్స్ బ్యాంక్ ఏ కస్టమర్, ప్రీపెయిడ్ ఇన్‌స్ట్రుమెంట్, వ్యాలెట్, ఫాస్టాగ్‌లలో డిపాజిట్లు, టాప్-అప్‌లు చేపట్టకూడదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశించిన విషయం తెలిసిందే. బ్యాంక్‌లో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు గుర్తించామని పేర్కొంది.