కార్ కొనాల‌ని చూస్తున్నారా ? వెయిటింగ్ స‌మ‌యం ఎంత ఉందో చూడండి..!

క‌రోనా లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌ను స‌డ‌లిస్తున్న‌ప్ప‌టి నుంచి దేశంలో జ‌నాలు ప్ర‌జా ర‌వాణా కాకుండా సొంత వాహ‌నాల‌ను ఎక్కువ‌గా వాడ‌డం మొద‌లు పెట్టారు. ఇక సొంత వాహ‌నాలు లేని వారు వాహ‌నాల‌ను ఎక్కువ‌గా కొంటున్నారు. కొంత స్థోమ‌త ఉన్న‌వారు కార్ల‌ను కొంటున్నారు. అయితే ప్ర‌స్తుతం అన్ని కార్ల త‌యారీ కంపెనీలు 100 శాతం ప్లాంట్ల‌ను ప‌నిచేయిస్తున్న‌ప్ప‌టికీ, ఉత్ప‌త్తిని పెంచినా.. దాదాపుగా అనేక కార్ల‌కు వెయిటింగ్ లిస్ట్ ఉంటోంది. దీంతో వినియోగ‌దారులు కార్ల‌ను బుక్ చేసినా ప్ర‌స్తుతం అనేక వారాలు, నెల‌లపాటు కార్ల డెలివ‌రీ కోసం వేచి చూడాల్సి వ‌స్తోంది.

planning to buy a car then look for waiting period

ప్ర‌ముఖ కార్ల కార్ల ఉత్ప‌త్తిదారు మారుతి సుజుకి 100 శాతం ప్లాంట్ల‌ను ప‌నిచేయిస్తోంది. అయిన‌ప్ప‌టికీ స్విఫ్ట్‌, ఆల్టో, వాగ‌న్ ఆర్ వంటి కార్ మోడ‌ల్స్‌కు 3 నుంచి 4 వారాలు ఆగాల్సి వ‌స్తోంది. ఇక ఎర్టిగా కార్‌కు అయితే ఏకంగా 6 నుంచి 8 వారాల స‌మ‌యం ప‌డుతోంది. ఇక హుండాయ్‌కు చెందిన కార్ దేన్ని బుక్ చేసినా నిన్న మొన్న‌టి వ‌ర‌కు 6 నెల‌ల వెయిటింగ్ పీరియ‌డ్ ఉండేది. కానీ ఆ కంపెనీ ఉత్ప‌త్తిని రోజుకు 340 యూనిట్ల నుంచి 640 యూనిట్ల‌కు పెంచ‌డంతో వెయిటింగ్ పీరియ‌డ్ ప్ర‌స్తుతం 2-3 నెల‌ల‌కు త‌గ్గింది.

అలాగే కియా కంపెనీ త‌న సెల్టోస్‌, సోనెట్ కార్ల‌ను ఆర్డ‌ర్ చేశాక 2-3 నెల‌ల్లోగా డెలివ‌రీ చేస్తోంది. ఆ కంపెనీ కూడా వెయిటింగ్ స‌మ‌యాన్ని త‌గ్గించ‌డం కోసం నెల‌కు 2000 యూనిట్ల‌ను ఉత్ప‌త్తి చేసేది ప్ర‌స్తుతం 3000 యూనిట్ల‌ను ఉత్ప‌త్తి చేస్తోంది. త్వ‌ర‌లో ఈ కెపాసిటీని 3500 యూనిట్ల‌కు పెంచ‌నున్న‌ట్లు కియా ప్ర‌తినిధులు తెలిపారు. అలాగే మ‌రో కార్ల కంపెనీ నిస్సాన్ కూడా ఇంత‌కు ముందు నెల‌కు 2700 యూనిట్ల‌ను ఉత్ప‌త్తి చేస్తుండ‌గా ఇప్పుడు 4000 యూనిట్ల‌ను ఉత్ప‌త్తి చేస్తోంది. దీంతో వెయిటింగ్ పీరియ‌డ్ త‌గ్గింది. అయిన‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం ఈ కార్ల డెలివ‌రీకి 2-3 నెల‌ల స‌మ‌యం ప‌డుతోంది. అలాగే మ‌హింద్రా కంపెనీకి చెందిన థార్ అనే మోడ‌ల్‌కు క‌నీసం 5 నుంచి గ‌రిష్టంగా 10 నెల‌ల స‌మ‌యం ప‌డుతోంది. ఈ క్ర‌మంలో కొత్త‌గా కార్ కొనాల‌ని అనుకునే వారు తాము కొన‌ద‌ల‌చిన కార్ డెలివ‌రీకి ఎంత స‌మ‌యం ప‌డుతుందో ముందే తెలుసుకుంటే మంచిది. లేదంటే నెల‌ల త‌ర‌బ‌డి వేచి చూడాల్సి ఉంటుంది.