భారత్లో ఎండలు భగ్గుమంటున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఉక్కపోతకు ప్రజలు విలవిలలాడిపోతున్నారు. మార్చిలోనే మంట మొదలుపెట్టిన సూర్యుడు.. మేలో మరింత ప్రతాపం చూపించనున్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. వేసవి నెలల్లో విపరీతమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయన్న సూచనల నేపథ్యంలో సంసిద్ధతపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు జిల్లా స్థాయి యంత్రాంగాలు సమన్వయంతో పనిచేయాలని ప్రధాని మోదీ ఆదేశించారు. ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో దేశంలోని చాలా ప్రాంతాలలో సాధారణం కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని సమావేశంలో అధికారులు ప్రధానికి వివరించారు. మధ్య పశ్చిమ ద్వీపకల్ప ప్రాంతంలో ఎండ తీవ్రత తీవ్రంగా ఉంటుందని తెలిపారు. మరోవైపు.. అవసరమైన మందులు, ఇంట్రావీనస్ ఫ్లూయిడ్స్, ఐస్ ప్యాక్‌లు, ఓఆర్‌ఎస్, తాగునీరు లభ్యత, ఆరోగ్య రంగానికి సంబంధించి ఆసుపత్రుల సన్నద్ధతపై సమీక్షించినట్లు కేంద్రం ఓ ప్రకటన విడుదల చేసింది. టీవీలు, రేడియోలు సహా ఇతర సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అవసరమైన సమాచారం అందించి ప్రజలకు అవగాహన కల్పించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది.