ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న వాటిలో సైబర్ నేరాలది మొదటి స్థానం. సైబర్ నేరాల విషయంలో భారత్ ప్రపంచంలోనే 10వ స్థానంలో ఉంది. ఇందులో రష్యా మొదటి స్థానంలో నిలిచింది. దాదాపు 100 దేశాలపై పరిశీలన జరిపిన అంతర్జాతీయ నిపుణుల బృందం.. ‘ప్రపంచ సైబర్‌నేర సూచీ’ని రూపొందించింది. ఇందులో వివిధ విభాగాల్లో సైబర్ నేరాలు అధికంగా జరిగే ప్రాంతాలను గుర్తించింది. భారత్లో ముందుగానే రుసుములు చెల్లింపులు జరిపించేలా చేసే మోసాలు ఎక్కువని తాజా అధ్యయనం తేల్చింది.
మాల్‌వేర్ వంటి సాంకేతిక ఉత్పత్తులు, సర్వీసులు; సైబర్ దాడులు, రాన్సమ్‌వేర్ సహా డబ్బు తస్కరణ, డేటా చౌర్యం, హ్యాకింగ్; ఖాతాలు, క్రెడిట్ కార్డుల వివరాల తస్కరణ, ముందస్తు చెల్లింపు మోసాలు, అక్రమ వర్చువల్ కరెన్సీతో కూడిన మనీ లాండరింగ్ వంటి నేరాలు జరుగుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ జాబితాలో రష్యా అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ఉక్రెయిన్, చైనా, అమెరికా, నైజీరియా, రొమేనియా, ఉత్తర కొరియా, బ్రిటన్, బ్రెజిల్ ఉన్నాయి.