మరోవైపు జమ్ముకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లోని దాల్ సరస్సు ఒడ్డునున్న షేర్-ఏ-కశ్మీర్ అంతర్జాతీయ సమావేశ కేంద్రం వద్ద నిర్వహించే కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన యోగాసనాలు వేశారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రపంచ నాయకులంతా యోగా గురించి తనతో చర్చించారని తెలిపారు. యోగా మనకు అపారమైన శక్తినిస్తుందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా యోగా ప్రాముఖ్యం వేగంగా పెరుగుతోందని వెల్లడించారు. యోగా కోట్లాదిమంది రోజువారి జీవన విధానంలో భాగమైందని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు.
మరోవైపు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో యోగాగురు రామ్‌దేవ్ బాబా, ఆచార్య బాలకృష్ణతో కలిసి యోగాసనాలు వేశారు. దిల్లీలో కేంద్రమంత్రులు బీఎల్ వర్మ, హెచ్‌డీ కుమారస్వామి, కిరణ్ రిజిజు, రాజ్‌నాథ్‌సింగ్, జేపీ నడ్డా తదితరులు 10వ అంతర్జాతీయ యోగాదినోత్సవం సందర్భంగా యోగాసనాలు వేశారు.