పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా లోక్సభలో పెనుదుమారం రేగింది. ముఖ్యంగా హిందుత్వ అంశంపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారానికి దారితీశాయి. మరోవైపు 18వ లోక్‌సభకు స్పీకర్‌ను ఎన్నుకున్న సమయంలో ప్రధాని మోదీతో కలిసి తాను కూడా స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చానని రాహుల్ గాంధీ తెలిపారు. ఆ సమయంలో తాను ఓ విషయాన్ని గమించినట్లు చెప్పారు.
తాను షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు స్పీకర్ నిటారుగా నిలబడ్డారని.. ప్రధాని మోదీ షేక్ హ్యాండ్ ఇవ్వగానే ఆయన ముందు తలవంచారని రాహుల్ ఆరోపించారు. సభలో స్పీకరే పెద్దవారని.. ఆయన ఎవరిముందు తలవంచకూడదని రాహుల్ పేర్కొన్నారు. స్పీకర్ ముందు అందరూ తలవంచి నమస్కరించాల్సిందేనని అన్నారు.
మరోవైపు అధికార బీజేపీ ప్రతిపాదించిన అంశాలను వ్యతిరేకిస్తున్న లక్షలాది మందిపై దాడి జరుగుతోందని రాహుల్ గాంధీ చెప్పారు. హిందువులుగా చెప్పుకుంటున్న కొందరు 24 గంటలూ కేవలం అహింస, ద్వేషం, అసత్యమే మాట్లాడుతున్నారని, మీరు అసలు హిందువులేనా అని రాహుల్ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ, అధికార పక్ష నేతలు తీవ్ర అభ్యంతరం తెలిపారు.