ఖలిస్థానీ సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్ పాల్ సింగ్ ఆ రాష్ట్ర పోలీసుల కన్నుగప్పి తప్పించుకు తిరుగుతున్న విషయం తెలిసిందే. మారువేషాల్లో తిరుగుతున్న అమృత్ పాల్ నేరచరిత్రపై ఫోకస్ చేసిన పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి. గత ఆర్రోజులుగా పంజాబ్ పోలీసులు అతడి కోసం వేట కొనసాగిస్తున్నారు. అయితే తాజాగా పోలీసులు అమృత్ పాల్ కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తున్నారు.
అమృత్పాల్ స్వగ్రామమైన జల్లుపూర్ ఖేరాకు వెళ్లిన పోలీసులు ఆయన తల్లిదండ్రులను విచారించారు. అమృత్ పాల్ భార్య కిరణ్ దీప్ కౌర్ ను కూడా అధికారులు ప్రశ్నించారు. అమృత్పాల్ కార్యకలాపాలకు విదేశాల నుంచి నిధులు అందుతున్నాయన్న ఆరోపణలపై కిరణ్దీప్కౌర్ను పోలీసులు విచారించినట్లు తెలుస్తోంది. కిరణ్దీప్కౌర్ యూకేకు చెందిన ఎన్నారై. మీడియా కథనాల ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరిలోనే అమృత్పాల్ ఆమెను వివాహం చేసుకున్నాడు.
గత శనివారం నుంచి అమృత్పాల్ కోసం పంజాబ్ పోలీసులు గాలిస్తున్న విషయం తెలిసిందే. మారువేషాల్లో అతను తప్పించుకు తిరుగుతున్నాడు. అయితే అతనితో లింకు ఉన్న మద్దతుదారుల్ని కొందర్ని ఇప్పటికే అరెస్టు చేశారు. వారిస్ పంజాబ్ దే కార్యకర్తల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు.