ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్‌పై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీఎం నివాసంలోనే తనపై దాడి జరిగినట్లు ఎంపీ ఫిర్యాదు చేయడంతో అక్కడి సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. మరోవైపు కేజ్రీవాల్ తల్లిదండ్రులను కూడా పోలీసులు ప్రశ్నించనున్నట్లు సమాచారం.
అనారోగ్యంతో బాధపడుతున్న తమ వృద్ధ తల్లిదండ్రులను విచారించేందుకు దిల్లీ పోలీసులు సిద్ధమయ్యారంటూ సీఎం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఈ క్రమంలోనే గురువారం ఉదయం సివిల్ లైన్స్‌లోని కేజ్రీవాల్ అధికారిక నివాసానికి పోలీసులు రానున్నట్లు తెలిసింది. సీఎం తల్లిదండ్రులతో పాటు ఆయన సతీమణి సునీత నుంచి వాంగ్మూలం తీసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
మరోవైపు స్వాతి మాలీవాల్‌పై దాడి ఘటనపై కేజ్రీవాల్ నిన్న తొలిసారిగా స్పందించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుగుతుందని ఆశిస్తున్నానని.. న్యాయం జరగాలని ఆయన అన్నారు. ఈ కేసులో రెండు కోణాలు ఉన్నాయన్న కేజ్రీవాల్.. ఇరుపక్షాల వైపు నిష్పక్షపాతంగా విచారణ జరిపినప్పుడే సరైన న్యాయం అందుతుందని అభిప్రాయపడ్డారు.