సార్వత్రిక సమరంలో ఇవాళ మూడో విడత పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంల్లోని 93 స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. అయితే ఈ పోలింగ్ ప్రక్రియలో విషాదం చోటుచేసుకుంది. బిహార్లోని సుపాల్ పోలింగ్లో బూత్లో ప్రిసైడింగ్ అధికారు గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించారు. సదరు అధికారిని శైలేంద్ర కుమార్గా గుర్తించారు.
‘శైలేంద్ర కుమార్ ఈరోజు ఉదయం చనిపోయారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఆయన ఒక్కసారిగా కుప్పకూలడంతో ఆయణ్ను సిబ్బంది వెంటనే హీహెచ్సీకి తరలించారు. కానీ అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాం. మృతుడి బంధువులకు సమాచారం అందించారు. వారు ఆస్పత్రికి వచ్చారు. పోస్టుమార్టంలో ఆయనకు షుగర్ ఉన్నట్లు తేలింది’ అని ఓ అధికారి తెలిపారు. మరోవైపు మూడో దశ ఎన్నికల పోలింగ్లో భాగంగా ఉదయం 9 గంటల వరకు 10.57% పోలింగ్ నమోదైంది.