ఢిల్లీ: ఇండియాలో క్రమంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఇన్నాళ్లు కేవలం 1500 లోపే నమోదవుతూ వచ్చిన కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయి. తాజాగా ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అయితే దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో అప్రమత్తమైంది కేంద్ర సర్కార్. ఇందులో భాగంగానే ఈ నెల 27న ముఖ్యమంత్రులతో ప్రధాని మోఢీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కరోనా కట్టడి చర్యలపై ఈ సందర్భంగా చర్చలు జరుగనున్నాయి.
ఇదిలా ఉంటే ఆరోగ్య శాఖ ప్రకటించిన నివేదిక ప్రకారం గత 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 2593 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 15,873 గా ఉంది. కిందటి రోజుతో పోలిస్తే ఇది 794 ఎక్కువ. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 44 మంది మరణించారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా బారిన పడి కోలుకున్నవారి సంఖ్య 4,25,19,479 గా ఉంది. మొత్తం మరణాల సంఖ్య 5,22,193గా ఉంది. ఇండియాలో ఇప్పటి వరకు మొత్తం 187 కోట్ల వాక్సిన్ డోసులను అందించారు.