భార్యా భర్తల మధ్య వివాదానికి సంబంధించి మధ్యవర్తిత్వ కేంద్రానికి వచ్చిన అల్లుడిపై మామ కాల్పులు జరిపిన ఘటన చండీగఢ్‌లోని న్యాయస్థానంలో చోటుచేసుకుంది. శనివారం రోజున జరిగిన ఈ ఘటనలో బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. అసలేం జరిగింది అంటే..?
ఇండియన్ సివిల్ అకౌంట్ సర్వీసెస్ (ఐసీఏఎస్) అధికారి అయిన హర్‌ప్రీత్ సింగ్‌కు భార్య అమితోజ్ కౌర్‌తో విభేదాలు తలెత్తాయి. 2023 నుంచి విడాకుల విషయమై వివాదం నడుస్తుండగా నాలుగో మధ్యవర్తిత్వ ప్రక్రియ నిమిత్తం శనివారం రోజున రెండు కుటుంబాలు ఇక్కడి సెక్టార్ 43లోని చండీగఢ్ జిల్లా కోర్టు కాంప్లెక్స్‌కు వచ్చాయి. మధ్యవర్తిత్వ ప్రక్రియ జరుగుతుండగా మధ్యాహ్నం 2 గంటల సమయంలో బయటకు వచ్చిన మాల్విందర్ సింగ్ సిద్ధూ.. అల్లుడు హర్‌ప్రీత్ సింగ్‌పై కాల్పులకు తెగబడ్డాడు. అనంతరం పారిపోయేందుకు ప్రయత్నించిన సిద్ధును కోర్టు ఆవరణలోని కొందరు న్యాయవాదులు పట్టుకుని ఒక గదిలో బంధించారు. పంజాబ్ పోలీసు శాఖలో సహాయ ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఏఐజీ)గా పని చేసిన మాల్విందర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.