తల్లిని చంపాడనే నేరంలో 11 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి ఎట్టకేలకు హైకోర్టు తీర్పుతో నిర్దోషిగా విడుదలయ్యాడు. మెదక్ జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవల్లిలో 2013 ఫిబ్రవరి 1న 80 ఏళ్ల తల్లిని చెట్టుకు టవల్‌తో ఉరి వేసి చంపాడన్న ఆరోపణపై పోచయ్యను పోలీసులు అరెస్టు చేశారు. తల్లి అనారోగ్యంతో విసిగిపోయి చంపేసినట్లుగా నిందితుడు నేరాన్ని అంగీకరించాడంటూ పోలీసులు దర్యాప్తును ముగించి అభియోగపత్రం దాఖలు చేశారు. విచారణ చేపట్టిన సిద్దిపేట కోర్టు హత్య, సాక్ష్యాలను మాయం చేశారన్న నేరాలపై 2015 జనవరి 12న యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
ఈ తీర్పును సవాలు చేస్తూ పోచయ్య హైకోర్టులో అప్పీలు దాఖలు చేయగా ఇటీవల జస్టిస్ కె.సురేందర్, జస్టిస్ జె.శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. వృద్ధురాలిది హత్యా.. ఆత్మహత్యా అనేది వైద్యుడు స్పష్టంగా చెప్పలేదని, ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులు కూడా లేరని హైకోర్టు వ్యాఖ్యానించింది. చట్టబద్ధమైన ఆధారాలు లేకుండా. ఊహాజనిత అంశాలతో కోర్టులు సొంత అభిప్రాయాలను ఏర్పరచుకోలేవని స్పష్టం చేస్తూ పోచయ్యపై మరే కేసులు లేనిపక్షంలో తక్షణం విడుదల చేయాలని ఆదేశించింది.