ఒడిశాలోని పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం ఓ అద్భుతమైన ఖజానా. జగన్నాథుని వెలకట్టలేని విలువైన ఆభరణాలను ఐదు కర్రపెట్టెల్లో ఉంచి, రహస్య గదిలో భద్రపరిచారు. అయితే గతంలో అప్పుడప్పుడు దాన్ని తెరిచి సంపద లెక్కించేవారు. కానీ 1978 తర్వాత దాన్ని తెరవడం ఆపేశారు. దీంతో ఆ భాండాగారాన్ని వివాదాలెన్నో చుట్టుముట్టాయి. అసలు తాళం ఏమైందనే అంశమే మొన్నటి ఎన్నికల్లో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. చివరకు కొత్త ప్రభుత్వం దాన్ని తెరవాలని నిర్ణయించింది.
దీంతో సుమారు 46 ఏళ్ల తర్వాత రత్న భాండాగారం తెరుచుకోనుంది. ఈ నెల 14వ తేదీన దీన్ని తెరవనున్నారు. ఆభరణాల లెక్కింపుతో పాటు అవసరమైన వాటికి మరమ్మతులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. భాండాగారాన్ని తెరిచే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ బిశ్వనాథ్ రథ్ కమిటీ రెండో దఫా సమావేశం నిర్వహించి.. 14న భాండాగారం తెరిచేలా ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని కమిటీలోని 16 మంది సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. భాండాగారం తెరవడంతో పాటు సంపద లెక్కింపు, ఆభరణాల భద్రత, మరమ్మతులపై ప్రభుత్వానికి నివేదించనున్నట్లు జస్టిస్ రథ్ వెల్లడించారు.