ఒడిశాలోని పూరీలో అపశ్రుతి చోటుచేసుకుంది. రథయాత్ర అనంతరం జరిగిన ఆచారంలో తప్పు జరిగింది. బలభద్రున్ని రథం నుంచి కిందకు దించుతున్న సమయంలో విగ్రహం సేవాయత్‌లపై ఒరిగిపోయింది. ఈ ఘటనలో 9 మంది సేవాయత్లు గాయపడ్డారు. వెంటనే పూరీ ఆస్పత్రికి తరలించి క్షతగాత్రులకు చికిత్స అందించారు. మిగలిన సేవాయత్లు విగ్రహాన్ని గుండిచా మందిరంలోకి తీసుకెళ్లారు. తదుపరి పూజా కార్యక్రమాలను పూర్తి చేశారు. ఈ ఘటనపై సేవాయత్‌లు, భక్తుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. ఇది ఆకస్మికంగా జరిగిపోయిందని సేవాయత్‌ల సంఘం ప్రతినిధి రామకృష్ణ దాస్ మహాపాత్ర్ చెప్పారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఆందోళన వ్యక్తం చేశారు. గాయపడిన సేవకులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈసారి పూరీలో రథయాత్రలో అపశ్రుతులుండవని, అంతా నిబంధనలకు అనుగుణంగా జరుగుతుందని న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ కొన్నిరోజుల క్రితం చెప్పారు. శ్రీక్షేత్ర యంత్రాంగం సేవాయత్‌లకు ఈ మేరకు సూచనలు కూడా చేసింది. సకాలంలో పురుషోత్తమ సేవలు పూర్తి చేయాలని, రథాలపై దివ్యవిగ్రహాల ఎదుట సేవాయత్‌లు అడ్డంగా నిల్చొరాదని స్పష్టం చేసింది. దీన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తామని పేర్కొన్నా యాత్రలో ఆ పరిస్థితి కనిపించలేదు.