పూరీ జగన్నాథుడి సేవల్లో తరచూ అపచారాలు, అవాంతరాలు ఎదురవుతున్నాయి. తాజాగా విరిగిన లక్ష్మీదేవి విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్న విషయాన్ని భక్తులు వెలుగులోకి తీసుకువచ్చారు. రత్న సింహాసనం వద్ద స్వామితోపాటు పూజలందుకున్న మహాలక్ష్మి ప్రతిరూపం శ్రీదేవి విగ్రహం అతుకులు ఊడిపోయి విరిగిపోయినా బయటకు కనిపించకుండా చేస్తున్నారన్న ఆరోపించారు.
మూడు దశాబ్దాల మహాలక్ష్మి ప్రతిరూపం శ్రీదేవి విగ్రహం చేయి తదితరచోట్ల అతుకులు ఊడిపోయాయి. అప్పట్లో స్వామికి దాతలిచ్చిన బంగారం, శ్రీక్షేత్రం భాండాగారంలో ఉన్న కొంత బంగారంతో కొత్త విగ్రహం చేయించారు. విగ్రహ ప్రతిష్ఠపై పుష్పాలక్, పూజాపండా సేవాయత్‌ల మధ్య వివాదం తలెత్తడంతో ఆ విగ్రహ ప్రతిష్ఠ జరగలేదు. దీంతో తయారు చేసిన విగ్రహం స్వామి రత్నభాండాగారంలోని రెండోగదిలో ఉంది.
అతుకులతో విరిగిన విగ్రహానికి పూజలు చేయడం అపచారమని పుష్పాలక్ సేవాయత్ సంఘం కార్యదర్శి హరేకృష్ణ సింహారీ అన్నారు. ఈ దిశగా పాలనాధికారి అరవింద పాఢి చర్యలు తీసుకోవాలని కోరారు. మూడు దశాబ్దాలుగా కొత్త విగ్రహం మూలన పడేయడం తగదని, స్వామి సన్నిధిలో ప్రాణప్రతిష్ఠ చేసి పూజించాలని పండిత నరేష్ చంద్రదాస్ విజ్ఞప్తి చేశారు.