మీ అహంకారాన్ని ప‌క్క‌న పెట్టి ప్ర‌జ‌ల ప్రాణాల‌ను ర‌క్షించండి: రాహుల్ గాంధీ

-

కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడు రాహుల్ గాంధీ ప్ర‌ధాని మోదీ, కేంద్ర ప్ర‌భుత్వంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సెంట్ర‌ల్ విస్టా ప్రాజెక్టుపై ఆయ‌న నిప్పులు చెరిగారు. దాన్ని నేర‌పూరిత వ్య‌ర్థ‌మ‌ని అభివ‌ర్ణించారు. ప్ర‌జ‌ల ప్రాణాలు పోతుంటే మీకు ఇప్పుడు ఇళ్ల నిర్మాణం ఎందుక‌ని ప్ర‌శ్నించారు.

rahul gandhi criticizes modi on central vista project

సెంట్ర‌ల్ విస్టా ప్రాజెక్టు కింద కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌నంతోపాటు ప్ర‌ధాని, ఉప రాష్ట్ర‌ప‌తి ఉండేందుకు నివాసాలు, కామ‌న్ సెక్రెటేరియ‌ట్ భ‌వాల‌ను నిర్మిస్తున్నారు. అయితే ఢిల్లీలో లాక్‌డౌన్ ఉన్న‌ప్ప‌టికీ ఈ భ‌వ‌నాల నిర్మాణాన్ని అత్య‌వ‌స‌ర సేవ‌ల కింద‌కు తెచ్చిన కేంద్రం వాటి నిర్మాణాల‌ను త్వ‌ర‌గా పూర్తి చేస్తోంది. ఈ క్ర‌మంలోనే రాహుల్ గాంధీ సెంట్ర‌ల్ విస్టా ప్రాజెక్టు నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వాన్ని తీవ్రంగా విమ‌ర్శించారు.

ప్ర‌ధాని మోదీ.. మీ అహంకారాన్ని ప‌క్క‌న పెట్టండి, సెంట్ర‌ల్ విస్టా ప్రాజెక్టు కాదు, ప్ర‌జ‌ల ఆరోగ్యంపై దృష్టి పెట్టండి, వారి ప్రాణాలు పోతున్నాయి.. అని రాహుల్ ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. దేశంలో ప్ర‌జారోగ్యం, వైద్య రంగంలో మౌలిక స‌దుపాయాల‌పై దృష్టి పెట్ట‌కుండా ఈ సమ‌యంలో నూత‌న ఇళ్ల‌ను, భ‌వ‌నాల‌ను నిర్మించ‌డం అవ‌స‌ర‌మా ? అని ప్ర‌శ్నించారు. దేశంలో చాలా క్లిష్ట ప‌రిస్థితులు ఉంటే సెంట్ర‌ల్ విస్టా ప్రాజెక్టును అత్య‌వ‌స‌ర సేవ‌ల కింద చేర్చి భ‌వ‌నాలను నిర్మించడంపై రాహుల్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

కాగా సెంట్ర‌ల్ విస్టా ప్రాజెక్టు కింద నూత‌న పార్ల‌మెంట్ భ‌వ‌నం, ఇత‌ర నిర్మాణాల‌ను చేప‌ట్టేందుకు మొత్తం రూ.11,794 కోట్ల నుంచి రూ.13,450 కోట్ల వ్య‌యం అవుతుంద‌ని అంచ‌నా వేశారు. మ‌రో 2-3 ఏళ్ల‌లో ఈ ప్రాజెక్టు పూర్తి కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news